కాఫీపోఖ్యానం
కొత్త సంవత్సరం నా మొట్టమొదటి రాతలతో మీ అందరికీ మంచి వేడివేడి, రుచికరమైన కాఫీ ఇద్దామనే ఉద్దేశంతో........
ఈ పాటికే మొదటి గుక్కలు గొంతులోకి వెళ్లి ఉంటాయి-ఇది చదివిన తర్వాత రెండో కప్పు నేను ఇచ్చినట్టుగా భావించి లాగించేయండి-సంకల్పంలో నాపేరు చెప్పుకుని మరీనూ! నేనూ ఇది రాసి, ఈ వంకన రెండో కప్పు లాగించేస్తా...
మీకు కాఫీ చేయడం రాదనోనో,బాగా కాఫీ పెట్టరనో- నేనీ కాఫీపోఖ్యానం చేయడం లేదు సుమా- అంత్యనిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలు అందుకే ముందే చెప్పేస్తున్నా! (మీరు మాఇంటికి వస్తే ఓ కప్పు మాంచి కాఫీ లభిస్తుందని భరోసా ఇవ్వడం కోసమే నా ఈ తాపత్రయమంతా- అంతేగానీ కీర్తి కండూతికి కాదు)
మంచి సువాసన-రుచి గల కాఫీ కావాలంటే “అరబికా” కాఫీ గింజలు మాత్రమే ఎంచుకుని మర పట్టించాలి-అందులో చికోరీ ఏ మాత్రం కలపకూడదు.డికాషన్ పలచగా ఉంటుంది సాధారణంగా- కాస్త చిక్కగా కావాలంటే ఫిల్టర్ లో పొడి ఎక్కువ వెయ్యాలి (కోట శ్రీనివాసరావు, రాజేంద్ర ప్రసాద్ లా కాకుండా) ఎప్పటికప్పుడు మనం కాఫీ కలుపుకునేటప్పుడే పచ్చిపాలు కాచి కాఫీకి వాడాలి. ఇది అసలు సిసలైన- “స్వచ్ఛమైన” ఫిల్టర్ కాఫీ-ఇది నా దృష్టిలో ఉత్తమమైన, శ్రేష్టమైన, రుచికరమైన కాఫీ! చిక్కటి గేదెపాలు దొరికితే స్వర్గంలో ఉన్న అనుభూతే అనుకోండి- అయినా మనకు దొరికేది బూతుపాలే కదా ఎక్కువగా ఈ రోజుల్లో!
ముందుగా కాచిన పాలతో కలిపితే కాఫీ రుచి రాదు, “యేడిగా ఉన్నా యేడిసినట్టే” ఉంటుంది- అలా కలిపితే! అలా కాకుండా “చికోరి” కలిపిన కాఫీ తాగే అలవాటు ఉన్నవాళ్లు “రోబస్టా” కాఫీ గింజలు వాడటం ఉత్తమం, ఇవి స్వతహాగా “అరబికా” కాఫీ గింజల కంటే చిక్కగానే ఉంటాయి-గింజ తీరే అంత-చికోరి కలపకముందే;సాధారణంగా హోటల్స్ వాళ్ళు ఇచ్చే కాఫీలో వాడేది- ఈ గింజల కాఫీ పొడే చికోరితో కలిపినది.
లేదంటే ఇంకో చిట్కా ఉంది-చికోరి కలపకుండా డికాషన్ చిక్కగా ఉండాలంటే... 70:30 దామాషాలో అరబికా:రోబష్టా కాఫీగింజలు మర ఆడించి ఆ పొడి వాడితే- చికోరి వేయకుండానే డికాషన్ చిక్కగా ఉంటుంది-సువాసనా ఉంటుంది. అరబికా పంట విస్తీర్ణం తక్కువ-దిగుబడి తక్కువ (అరటిపళ్ళలో చెక్కర కేళీ లాగా) అంచేత కొద్దిగా ధర కూడా ఎక్కువే మరి-కానీ ఆ రుచి ముందు ధర దిగదుడుపే నిస్సందేహంగా-ధర ఎక్కువ పెట్టాం అనే ఫీలింగే ఉండదు!
కాఫీ తాగేది మన కడుపుకేగా, అందునా పొద్దున్నే లేవగానే తాగే మొదటి చుక్క- దేవతల అమృతంలా-అమృతం కదా అని పొద్దస్తమానం వాళ్ళూ తాగరు అనుకోండి -వాళ్ళు కూడా ఈమధ్య అప్పుడప్పుడు కాఫీ తాగుతారని తెలిసింది- అదీ దేవేంద్రుడికి తెలియకుండా- శచీదేవికి (ఇంద్రాణి, పులోమజ అని కూడా అంటారు ఈవిడని) తెలిసిన ఆ రహస్యం తన దగ్గర అట్టే పెట్టేసుకుంది- దేవతలకి ఒట్టు వేసి మరీను.
అయినా వాళ్ళ భ్రమగానీ కాఫీ వాసన దేవేంద్రుడి ముక్కుపుటాల దాకా చేరకుండా ఉంటుందా ఏదో రోజున-బహుశా ఆ వాసన సోకిన తర్వాత ఇంద్రుడు కూడా కాఫీ సేవనం మొదలు పెడతాడని ఇంద్రాణి మనసులో నమ్మకం, ఆశా అయి ఉండొచ్చు కూడా- భర్త సంగతి భార్యకి తెలియక ఇంకెవరికి తెలుస్తుంది- “అమ్మపుట్టిల్లు మేనమామకు తెలిసినట్టు” అదీ కాకుండా దానితో ఆవిడ అక్కడా ఇక్కడా కాఫీ తాగే బాధ తగ్గుతుంది-ఎంచక్కా ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడే కలుపుకొని తాగచ్చు.
ఇంత చెప్పినా మీకు అనుమానం రావచ్చు-నేనేదో బడాయి కబుర్లు చెప్తున్నా అనీ ఈ కాఫీ స్వర్గానికి ఎలా చేరింది అని; ఏం- పారిజాతవృక్షం చూసి సత్యభామ మోజుపడితే శ్రీకృష్ణుడు భూలోకానికి తేలా స్వర్గాన్నించి. కాకపొతే ఇక్కడ ఈకాఫీ భూలోకం నుంచి స్వర్గ లోకానికి ఎగుమతి అయ్యింది-పుణ్యం కట్టుకుంది మాత్రం నారదమహామునే.సకలలోక సంచారకుడు కదా- ఓ మారు భూలోకానికి వచ్చినప్పుడు ఓ మహాఇల్లాలు ఇచ్చిన ఓ కప్పు కాఫీతో అదిరిపోయాడు.
ఆ దేవతలు అమృతం తాగుతూ మానవులకు అది లభ్యం కాదు కదా అనే సంబరపడిపోతున్నారు.ఆ వెర్రిబాగులవాళ్లకి తెలియలేదు ఇక్కడ అమృతాన్ని మించిన పానీయం ఒకటి ఉందని (ఆయనికి తెలిసింది కూడా ఆ మహాఇల్లాలి ధర్మమా అనే కదా) అదేమాట నారదమహాముని ఆ ఇల్లాలికి నమస్కరించి ఆవిడతో అనేశాడు కూడా. కాఫీగత ప్రాణులకి ఇది ఓ శుభ వార్తే -ఇక్కణ్ణుంచి అక్కడికి వెళ్లినా కాఫీ మిస్ అవ్వం మరి!
నారదుడు మంచిపనిచేసాడు- లేకపోతే నేను ఇక్కణ్ణుంచి వెళ్ళేటప్పుడు- “కూర్గ్” ప్రాంతం నుంచి ఓ రెండు కాఫీమొక్కలు తీసికెళ్ళి స్వర్గంలో పాతేద్దాం అనుకున్నా-అయినా తీసికెళ్తాలెండి- పనిలో పని ఓ గేదెని కూడా తీసుకెళ్తే పోలా-నిత్యమూ కాఫీ దొరుకుతుంది-నాకు ఇబ్బందీ ఉండదు; అదీకాక,కాస్త దేవతల్ని మచ్చిక చేసుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది. అసలు ఈ కాఫీ గొడవ ఎత్తటానికి కారణం కాఫీ గురించి చెబుదామని కాదు- “మాకు తెలిసిన కాఫీ గురించి ఇంత సోది చెప్పి మళ్ళీ ఇదేంటి” అనుకుంటున్నారా!
ప్రతి నిత్యం మన గొంతు తడిపేది ఈ కాఫీ చుక్కలే కదా- దాదాపుగా ప్రాణవాయువు లాంటిది- (ఐ.సి.యూ లో వెంటిలేటర్ లాగా) కాఫీగతప్రాణులకి .ఈ విషయమే చాలాచక్కగా- మహానుభావుడు జొన్నవిత్తులవారు ఆశువుగా ఓ అష్టకమో, శతకమో రాశారు కాఫీ మొహాన్న.
ఈ మాత్రం కాఫీయే ఇంత కష్టపడితేగానీ రాదు కదా ("ఈ మాత్రం" అనే మాట అనడం ఇష్టం లేకపోయినా, “కాఫీకి-జీవితానికి” ఉన్న సారూప్యత చెప్పడం కోసమే రాసాను- లేకపోతే కాఫీయే నా ప్రాణం మరి) మరి జీవితంలో కూడా కాఫీలాగే ప్రతినిత్యం, అద్భుతంగా ఉండాలంటే ఇంకెంత కష్టపడాలో ఆలోచించండి. అంచేత జీవితంలో కష్టపడటం నేర్చుకుందాం, అలవాటుగా కూడా చేసుకుందాం- "కష్టే ఫలి" అని ఊరికినే అన్నారా మన పెద్దవాళ్ళు.అలా చేయకలిగితే జీవితాంతం- రోజూ మాంచి కాఫీ తాగుతూ ఉండచ్చు గుటుక్కుమనేవరకూ -చివరి గుక్కవరకూ తాగుతూ.
ఏదో "కాఫీ తాగే తాగుబోతు మాటల్లా నా మాటలు కొట్టివేయకండి" కాఫీయే కదా నిక్షేపంగా తాగేయండి ఎన్ని కప్పులైనా-కాఫీ, వ్యసనం కాదుగా మరి!
ఇక ఉంటా- కాఫీ తాగే టైం అయింది, అయినా కాఫీ తాగటానికి టైం ఏమిటి-వేళాపాళా లేకుండా తాగేదే కాఫీ! ఎన్ని కప్పులైనా తాగొచ్చు...
కాఫీ చాలా రుచికరమైనది.అంతా మన చేతల్లో, చేతుల్లో...
ఓ కాఫీ ప్రియుడు